
ఉక్కు కార్మికులకు వేతనాలు చెల్లించాలి
కంచాలు కొట్టి మహిళల నిరసన
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని మహిళలు డిమాండ్ చేశారు. సోమవారం స్టీల్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యోగుల కుటుంబీకులు అడ్మిన్ బిల్డింగ్ కూడలి పెద్ద ఎత్తున ధర్నాలో చేశారు. మహిళలు, ఉద్యోగులు కంచాలు కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ఉక్కు కార్మికులకు జీతాల చెల్లించామని కేంద్ర ఉక్కు మంత్రి ప్రకటించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఉక్కు కార్మికులకు గత ఏడాదిగా పూర్తి జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు. జీతాలు చెల్లించమని అడిగిన కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్టీల్ కార్మికులకు బోనస్ చెల్లించే అంశంపై చర్చలు జరుగుతుంటే ఇక్కడ జీతాల చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు. జిల్లా సీఐటీయూ నాయకులు ఎన్.రామారావు మాట్లాడుతూ జీతాలు చెల్లించమని అడుగుతున్న కార్మికులపై చర్యలు చేపట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వై.టి.దాస్, మహిళా నాయకురాలు వేణు తదితరులు పాల్గొన్నారు.