
తీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థుల మృతదేహాలు
కొమ్మాది: రుషికొండ బీచ్‌కు సమీపంలో ఆదివారం సాయంత్రం పీఎంపాలేనికి చెందిన ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంఘటన తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున రుషికొండ బీచ్ సమీపానికి శ్యామ్ సాయి, సంజయ్‌లు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఆదివారం సాయంత్రం పీఎంపాలేనికి చెందిన నలుగురు స్నేహితులు సంజయ్, శ్యామ్ సాయి, సాగర్, టి. బాలాదిత్య సినిమాకు వెళ్తామని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి సాయంత్రం 5 గంటల సమయంలో రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. వీరిలో ముగ్గురు పదో తరగతి చదువుతుండగా, ఒకరు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. ఈ నలుగురు రుషికొండ బీచ్ వద్ద అరగంట సరదాగా గడిపారు. అనంతరం బీచ్‌లో స్నానాలు చేయడానికి దిగుతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డ్స్ చీకటి పడుతుందని వారిని నీళ్లల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయి ఏ1 గ్రాండ్ ఫంక్షన్‌హాల్ వెనుక ఉన్న బీచ్ వద్దకు వెళ్లి స్నానాలకు దిగారు. ఇదంతా ప్రమాద స్థలం. వీరు నలుగురు స్నానాలు చేస్తూ, ఈత కొడుతున్న క్రమంలో మండల సంజయ్, శ్యామ్ సాయి కెరటాల తాకిడికి కొట్టుకుపోయారు. వీరి కోసం అధికారులు, పోలీసులు, లైఫ్‌గార్డ్స్ ఎంత గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. సోమవారం విగతజీవులుగా తీరానికి కొట్టుకొచ్చారు. మృతదేహాలు చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.