
జేపీ నడ్డా దిష్టిబొమ్మ దహనం
బీచ్‌రోడ్డు: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ పర్యటనలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండించాయి. ఈ చర్యకు నిరసనగా సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నడ్డా దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై. రాంబాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి యూ. నాగరాజు మాట్లాడుతూ బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా విశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పీవీఎస్‌ఎన్ మాధవ్ స్టీల్‌ప్లాంట్‌కు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, అలాగే విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. పునాదులు కూడా పడని మిట్టల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని ఎంపీలు కోరడం సరికాదని వారు మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి, మహిళా సమాఖ్య ఎన్ మధురెడ్డి, కెల్ల రమణ, హేమానంద్, గ్రేస్ ప్రకాష్, దేముడమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.