
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యాయత్నం
అల్లిపురం: ఎంవీపీకాలనీలో ఉంటున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ భైవరపట్ల శ్రీరామ్(41) సూర్యాబాగ్‌లో గల ఒక హోటల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం సూర్యాబాగ్‌లో గల రాఘవేంద్ర హోటల్‌లో ఆయన అద్దెకు తీసుకున్న గది నుంచి ఘాటైన వాసన రావడంతో సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ఎర్రంనాయుడు, ఎస్‌ఐ కొల్లి సతీష్, కానిస్టేబుళ్లు గది తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్లే సమయానికి శ్రీరామ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ గదిలో దొరికిన లేఖలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రాసి ఉన్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి ఒకరి ప్రాణాన్ని రక్షించినందుకు గాను సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.