
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ ఆపాలి
సీతంపేట : మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడాన్ని నిలిపివేయాలని రిమ్స్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ తెన్నేటి జయరాజు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదొక రాజకీయ నిర్ణయమని... ప్రజలు ఓటు ద్వారానే గుణపాఠం చెప్పాలన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో సీట్లు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే స్థితి దళిత బహుజనులకు లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఏఎంఎస్ కార్యదర్శి జె.వి.ప్రభాకర్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం దారుణమన్నారు. దీనివల్ల వైద్యులు, సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు కోల్పోతామని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు వజ్జిపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బహుజనులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. సమావేశంలో స్టీల్‌ప్లాంట్ యూనియన్ నాయకులు దాస్, సీపీఎం నాయకుడు కృష్ణారావు, భారత బచావీనాయకుడు ఎస్‌ఆర్ వేమన, ఏఎంఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.