
‘కోడలు కుటుంబం నుంచి రక్షణ కల్పించాలి’
మహారాణిపేట: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బెల్జియంకు చెందిన ఓ కుటుంబం సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించింది. బెల్జియంలో పుట్టి పెరిగి, విశాఖలో స్థిరపడిన వరహామన్ లూసీన్, అతని భార్య ధనలక్ష్మి ఈ వినతిని సమర్పించారు. వారి కుమారుడు అశోక్ కుమార్, బిందురాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలం తరువాత బిందురాణి కుటుంబ సభ్యులు తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవల పలాసలో బిందురాణి కుటుంబం తమపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పలాస వెళ్లడానికి భయపడుతున్నామని, ఈ కేసును విశాఖకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.