
ట్రాఫిక్ కష్టాలకు ఏఐతో చెక్
డాబాగార్డెన్స్: నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించి, శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో జీవీఎంసీ, నగర పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రాజెక్టు సారథి అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ద్వారా నగరంలో ట్రాఫిక్ నిర్వహణను సమూలంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు సారథి పురోగతిని సమీక్షించారు. నగరంలోని ఐదు కీలక ప్రాంతాల్లో ఐదు వేర్వేరు సంస్థల ద్వారా పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ద్వారా డేటాను సేకరించినట్లు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టులో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు తాము సేకరించిన డేటాను, ఫలితాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, శాంతిభద్రతల పరిరక్షణకు మరిన్ని అంశాలను జోడించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టులో నెల రోజుల పాటు నమోదైన ఫలితాలను సమీక్షించి, నగరం మొత్తం ఈ వ్యవస్థను విస్తరించేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ మరింత సులభతరం అవుతుందని సీపీ అన్నారు.