
దుఃఖంలోనూ మానవత్వం
పెందుర్తి: బతుకుదెరువు కోసం ఊరికాని ఊరు వచ్చాడు. కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ భార్యాపిల్లలను పోషించుకుంటున్నాడు. అయితే ఓ బాలుడు ఆకతాయితనానికి రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ విషాద సమయంలోనూ అతని కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. మృతి చెందిన వ్యక్తి నేత్రాలను దానం చేసి ఇద్దరికి చూపునిచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. కె.కోటపాడు మండలం ఎ.కోడూరుకు చెందిన చీపురపల్లి సతీష్ (44) ఉపాధి నిమిత్తం తన భార్య వరలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి కొన్నేళ్ల కిందట విశాఖపట్నం వచ్చాడు. నాయుడుతోటలో నివాసం ఉంటున్న సతీష్ ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం డెలివరీలు ఇచ్చేందుకు పెందుర్తి–ఆనందపురం రోడ్డులో బైక్‌పై వెళ్తున్నాడు. అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో ఒక బాలుడు అతి వేగంగా నడుపుతున్న బైక్, సతీష్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సతీష్ భార్య వరలక్ష్మి, పిల్లల రోదనలు అక్కడున్న వారిని కదిలించాయి. సీఐ కె.వి సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కష్ట సమయంలో సతీష్ కుటుంబ సభ్యులను పెందుర్తి పోలీసులు, స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీను, మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధి మనోజ్ నేత్రదానం కోసం సంప్రదించారు. తమ బాధను దిగమింగుకుని సతీష్ కుటుంబం నేత్రదానానికి అంగీకరించింది. విషాదంలోనూ వారు చూపిన ఈ మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంది.
రోడ్డు ప్రమాదంలో
మృతి చెందిన వ్యక్తి కళ్లు దానం

దుఃఖంలోనూ మానవత్వం