
సచివాలయ ఉద్యోగుల సమ్మె నోటీసు
జగదాంబ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు 15 రోజుల్లో పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు జోన్–4 కమిషనర్ మల్లయ్యనాయుడికి గురువారం నోటీసు అందజేసినట్లు జేఏసీ నాయకులు పీజే గణేష్‌కుమార్, పల్లా కిరణ్‌కుమార్ యాదవ్, చింతకాయల బంగార్రాజు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి విధులు నిర్వహించడం అవమానాలకు గురిచేయడంతో పాటు, ఉద్యోగులు ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని లేఖలో వివరించారు. ఉద్యోగుల సమస్యలు, హక్కులు, భద్రత, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీవీ అశోక్‌కుమార్, నాగేశ్వరరావు, శ్రీకాంత్, రమేష్‌బాబు, చంద్రశేఖర్, రమేష్, నాగరాజు, నళిని, సంతోష్‌కుమార్, త్రివేణిరాజు ఉన్నారు.
పౌరుల సహకారంతో వీ–పుల్ బలోపేతం
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
డాబాగార్డెన్స్: పట్టణ సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనేందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ‘వైజాగ్–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్ మోడల్’(వీ–పుల్) వ్యవస్థను బలోపేతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు. బ్లూమ్‌బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 50 ఫైనలిస్ట్ నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలవడం ఈ వ్యవస్థకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు అని కమిషనర్ తెలిపారు. వీ–పుల్ వ్యవస్థను సంస్థాగతం చేయాలని నిర్ణయించామని, ఇది ప్రజలు, సంస్థలు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి సహకారంతో పరిష్కారాలు కనుగొనేందుకు దోహదపడుతుందని వివరించారు. ప్రతి పౌరుడు ఈ వీ–పుల్ వేదిక ద్వారా తమ ఆలోచనలు, సూచనలు, సలహాలు పంచుకోవాలని కమిషనర్ కోరారు. సమష్టిగా పనిచేయడం ద్వారా బలమైన, సురక్షితమైన విశాఖను నిర్మించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, సీసీపీ ఎ.ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, యూసీడీ పీడీ పి.ఎం.సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.