
వామపక్షాల ఐక్యతే ఏచూరికి నిజమైన నివాళి
మద్దిలపాలెం: ఆర్‌ఎస్‌ఎస్, నయా ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవడానికి వామపక్ష భావజాలంతో కూడిన శక్తులు ఏకం కావాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పిలుపునిచ్చారు. ఇదే సీతారాం ఏచూరికి సరైన నివాళి అవుతుందని ఆయన పేర్కొన్నారు. పిఠాపురంకాలనీలో నూతనంగా నిర్మంచిన సీపీఎం విశాఖ జిల్లా కార్యాలయం(సీతారాం ఏచూరి భవనం)ను గురువారం ఆయన ప్రారంభించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అధ్యక్షత వహించిన సభలో బేబీ మాట్లాడారు. ఏచూరితో తమ 45 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. దేశంలో పీడిత ప్రజలు, ఆదివాసీలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఏచూరి దృక్పథం అగ్రగణ్యమైనదని కొనియాడారు. కులవివక్ష, కార్మిక పోరాటాలు ఉన్న ప్రతి చోటా ఎర్ర జెండా ఉండాలని బేబీ పిలుపునిచ్చారు. ఏచూరి పేరు మీద ఆధునికంగా జిల్లా కార్యాలయాన్ని నిర్మించిన పార్టీ శ్రేణులను అభినందించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ కార్యాలయం ఒక పోరాట కేంద్రమని, పీడిత ప్రజలు తమ కష్టాలను చెప్పుకోవడానికి, పోరాడడానికి శక్తిని పొందే నిలయమని పేర్కొన్నారు. ఏచూరి వర్ధంతి లోపు ఈ భవనాన్ని పూర్తిచేసి కమ్యూనిస్టు స్ఫూర్తిని చాటిచెప్పిన విశాఖ జిల్లా కమిటీని ఆయన అభినందించారు. కొత్త భవనంలో మీటింగ్ హాల్, గ్రంథాలయం, కుట్టుమిషన్ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, కె.లోకనాథం, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, పార్టీ సీనియర్ నాయకులు సి.హెచ్.నరసింగరావు, అజశర్మ, చంద్రశేఖర్, ఎం.వెంకటేశ్వర్లు, దేవా, ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.జగన్, బి.పద్మ, పి.మణి తదితరులు పాల్గొన్నారు.