
‘సెయింట్ జోసెఫ్’ ప్రపంచ రికార్డు
11.19 లక్షల సీడ్ బాల్స్ తయారీ
కంచరపాలెం: పర్యావరణ పరిరక్షణలో సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. సెయింట్ జోసెఫ్ కాంగ్రిగేషన్ 375వ వార్షికోత్సవం సందర్భంగా 11.19 లక్షల సీడ్ బాల్స్‌ను తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించారు. సెయింట్ జోసెఫ్ ఆఫ్ అన్నసీ సిస్టర్స్, విశాఖ ప్రావిన్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రపంచ రికార్డు సాధన లక్ష్యంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జ్ఞానాపురంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల, సెయింట్ జోసెఫ్ బాలికల పాఠశాలలో సీడ్ బాల్స్ తయారీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 16 సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థలు పాల్గొని.. మొత్తం 11.19 లక్షల సీడ్ బాల్స్‌ను తయారు చేశాయి. ఒక్క జ్ఞానాపురం కళాశాల నుంచే 3,253 మంది విద్యార్థులు పాల్గొని 1,93,534 సీడ్ బాల్స్‌ను తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వరల్డ్ రికార్డ్స్ అధికారులు అన్ని విద్యా సంస్థల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించారు. పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ, సుస్థిర భవిష్యత్తు కోసం ఇది ఒక గొప్ప ముందడుగు అని వారు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల సిస్టర్ షైజీ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాకుండా, చక్కని భవిష్యత్తు కోసం విత్తనాలను నాటనున్నట్లు తెలిపారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ అధికారి డాక్టర్ షరీఫా హనీఫ్ చేతుల మీదుగా అవార్డు, సర్టిఫికెట్‌ను అందుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ హేమ, ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ రోజ్, ఆఫీస్ సిస్టర్స్ మేరీ, నాన్సీ, డైసీ, కళాశాల పీఆర్వో డాక్టర్ పి.కె.జయలక్ష్మి పాల్గొన్నారు.