
బాణసంచా దుకాణాలపై దాడులు
డాబాగార్డెన్స్: అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.2.66 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీటీఎఫ్ ఎస్‌ఐ భరత్‌కుమార్ తెలిపిన వివరాలివి. వన్‌టౌన్ కురుపాం మార్కెట్ ప్రాంతంలో లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మూడు దుకాణాలపై దాడులు నిర్వహించారు. కురుపాం మార్కెట్‌కు చెందిన పాలూరి వరప్రసాద్ దుకాణం నుంచి రూ. 2.06లక్షల విలువైన బాణసంచా సామగ్రి, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే బండారు అప్పలరాజు నుంచి రూ. 50వేలు, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బొటాట భవానీశంకర్ నుంచి రూ.10 వేలు విలువ చేసే మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారంపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కోసం వారిని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఐ భరత్ తెలిపారు.
రూ.2.66 లక్షల సామగ్రి స్వాధీనం