
విశాఖ వ్యాలీ స్కూల్‌కి సీఫోర్ అవార్డు
ఆరిలోవ: నగరంలోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్ ఈ విధానంలో నడుస్తున్న పాఠశాలల్లో విశాఖ వ్యాలీ స్కూల్ సీఫోర్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీకి చెందిన సీఫోర్ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో భాగంగా నగరంలోని పాఠశాలల్లో ఈ స్కూల్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్‌కు సీఫోర్ ప్రతినిధులు అవార్డుతో పాటు జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఫోర్ ప్రతినిధులు తమ పాఠశాలలో పిల్లలు, వారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను కూడా సర్వే చేశారని తెలిపారు. కో–ఎడ్యుకేషన్ పాఠశాలలో అనుసరిస్తున్న విద్యా విధానం, బోధనా పద్ధతులు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పర్యావరణ పరిరక్షణ, పాఠశాల నిర్వహణ, క్రీడలు, విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి అంశాలను సర్వే చేసి.. పాఠశాలలకు జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ ఇస్తారన్నారు. ఈ అంశాల్లో తమ పాఠశాల ఉత్తమంగా నిలవడంతో నగరంలోనే మొదటి స్థానా న్ని సాధించినట్లు వివరించారు. 1,190 మార్కులతో జాతీయ స్థాయిలో టాప్–50 పాఠశాలల్లో ఒకటిగా నిలించిందని వెల్లడించారు.