
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం
బీచ్‌రోడ్డు: రాష్ట్రంలోని 17 కొత్త వైద్య కళాశాలల్లో పదింటిని పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పీడీఎస్‌వో విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌వో జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి మాట్లాడుతూ.. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలను 33ఏళ్ల పాటు లీజుకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల సుమారు 1,500 ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితమవుతాయన్నారు. ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటా 50శాతం తగ్గి, మిగిలిన 50శాతం సీట్లను మార్కెట్ రేట్లకు విక్రయించడం ద్వారా ఫీజులు విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నాబార్డ్ నిధులు రూ.8,500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలలో కళాశాలలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024లో పులివెందుల కళాశాలను తిరస్కరించడంతో పాటు, 80శాతం నిర్మాణం పూర్తయిన పది కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేయాల్సిందిగా ఎన్‌ఎంసీకి లేఖ రాసిందని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. జీవో 107, 108లను 100 రోజుల్లో రద్దు చేసి, 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలు నీటి బుడగలుగా మారాయని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకత లేకుండా, కన్సల్టెన్సీల ద్వారా ఈ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఈ పీపీపీ మోడల్ విస్తరిస్తే, అన్ని ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆందోళనలో పీడీఎస్‌వో జిల్లా కమిటీ సభ్యులు జానకి, లక్ష్మణ్, లోకేష్, లైకోన్, తులసి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
వైద్య విద్య ఖరీదుగా మారుతుందని
పీడీఎస్‌వో ఆందోళన