
యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కీలకం 2030 నాటికి 50 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టిపై ‘గేమ్’ దృష్టి గేమ్ సహ వ్యవస్థాపకుడు మదన్
విశాఖ సిటీ : దేశంలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(గేమ్) పనిచేస్తోందని గేమ్ సహ వ్యవస్థాపకుడు పి.మదన్ పేర్కొన్నారు. మంగళవారం సిరిపురంలోని ది డెక్ భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్‌టీఐహెచ్)లో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉద్యమాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా 2030 నాటికి 50 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఏ–హబ్ సీఈవో రవి ఈశ్వరపు మాట్లాడుతూ ఆర్‌టీఐహెచ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. విశాఖలో ఈ కార్యక్రమాన్ని ఒక పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టగా.. భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. కన్ఫెడరేషన్ ఆఫ్ వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఔత్సాహికులు ఎవరైనా ఒక ఐడియాతో గేమ్‌కు వస్తే.. ఒక పారిశ్రామికవేత్తగా బ్రాండింగ్‌తో వెళ్లేంత వరకు సహాయ సహకారాలు ఉచితంగానే అందిస్తుందని తెలిపారు. సమావేశంలో నేటివ్ అరకు కాఫీ అధినేత రామ్‌కుమార్ వర్మ, గేమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కేతుల్ తదితరులు పాల్గొన్నారు.