
ధర్నా స్థలంలో మొక్కలు నాటిన స్టీల్‌ప్లాంట్
కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలను కట్టడి చేయడానికి యాజమాన్యం మరో ఎత్తుగడ వేసింది. కొన్ని రోజులుగా కార్మికులు నిరసనలు చేస్తున్న ఉక్కు పైలాన్ వద్ద మొక్కలు నాటించింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు కూర్మన్నపాలెంలోని ఉక్కు పైలాన్ వద్ద దీక్షలు, ధర్నాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశంలో ఉన్న టెంట్ కొన్ని రోజుల కిందట వర్షాలకు తడిసి కూలిపోయింది. దీనిని ఆసరాగా తీసుకున్న యాజమాన్యం.. కార్మికులు ధర్నాలు నిర్వహించే స్థలం చుట్టూ కంచె వేసింది. దీంతో కార్మిక సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆందోళనల నిర్వహణకు అనుమతి పొందాయి. ఆ అనుమతితో ఇటీవల పైలాన్‌కు ఎదురుగా ఉన్న రోడ్డులో ధర్నాను నిర్వహించాయి. అయితే యాజమాన్యం మంగళవారం పైలాన్ ప్రాంతంలో మొక్కలు నాటించింది. దీని వల్ల భవిష్యత్తులో కార్మికులు ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి కూడా వీలు లేకుండా యాజమాన్యం అన్ని విధాలుగా కట్టడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ తాజా పరిణామంపై కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.