
చాగంటికి కొప్పరపు కవుల జాతీయ పురస్కారం
మద్దిలపాలెం: ప్రఖ్యాత ప్రవచనకారులు, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2025 అందుకున్నారు. తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన ఆశుకవితా సార్వభౌములు కొప్పరపు సోదర కవుల స్మృతిలో నెలకొల్పిన కొప్పరపు కవుల కళాపీఠం 23వ వార్షికోత్సవం మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సభాధ్యక్ష వహించగా.. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ గౌరవ అతిథిగా, అమెరికాలోని లిపి సంస్థ వ్యవస్థాపకులు సాగర్ అనిసింగరాజు, మా శర్మ ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ పంచభూతాల్లాగే తెలుగు భాష వెలుగొందాలని ఆకాంక్షించారు. తెలుగు వారికి ఆధ్యాత్మికత, సంస్కృతి, భాష, వారసత్వ సంపదలు గర్వించదగినవిగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు కొప్పరపు కవుల పద్యాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కొప్పరపు సోదర కవుల వంటి గొప్ప సరస్వతీ ఉపాసకుల పేరిట ఈ పురస్కారం లభించడం భగవత్ కృప అని అన్నారు. అవధానం అనేది కేవలం భాషపై పట్టుతో రాదని, సకల శాస్త్రాలు, పురాణాలపై పట్టు, సమయోచిత జ్ఞానం అవసరమని చెప్పారు. సంగీత సాహిత్య సమ్మేళనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్, గాయని ఆలమూరు రాధా కుమారి తమ కళలను ప్రదర్శించారు. భారతీభూషణ రాంభట్ల నృసింహశర్మ సభా వ్యాఖ్యానాలు చేశారు. పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావుకు జాతీయ జర్నలిస్టుల సంఽఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సత్కరించి, అప్పన్న అంక్షితలు అందజేశారు.