కొండంత బకాయి.. గోరంత చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

కొండంత బకాయి.. గోరంత చెల్లింపు

Sep 10 2025 9:21 AM | Updated on Sep 10 2025 10:14 AM

కొండంత బకాయి.. గోరంత చెల్లింపు

కొండంత బకాయి.. గోరంత చెల్లింపు

జీవీఎంసీ కాంట్రాక్టర్లకు ‘కంటితుడుపు’ 13 నెలల బకాయిలకు గాను ఒక్క నెల బిల్లుల విడుదల ఇంకా రూ.380 కోట్లు చెల్లించని కూటమి ప్రభుత్వం

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ కాంట్రాక్టర్ల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సుమారు 13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.420 కోట్ల బిల్లులకు గాను, కేవలం గతేడాది జూలైకు సంబంధించిన రూ.40 కోట్లను మొక్కుబడిగా చెల్లించి చేతులు దులుపుకుంది. ఈ కంటితుడుపు చర్యతో తమ కష్టాలు ఏమాత్రం తీరవని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకే బిల్లులు వచ్చేవని, ఇప్పుడు ఏడాది దాటినా నిరీక్షణ తప్పడం లేదని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నా రు. అప్పులు చేసి పనులు పూర్తి చేసి, నేడు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు. దసరా పండగ సమీపిస్తున్న వేళ.. తమ వద్ద పనిచేసిన కార్మికులకు జీతాలు కూడా ఇవ్వ లేని దయనీయ స్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘నిధి పోర్టర్‌’ సైతం పాత బిల్లుల విషయంలో నిరుపయోగంగా మారిందని, దాని వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బకాయిల కోసం నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంఎస్‌ఎంఈ నేషనల్‌ బోర్డు సభ్యుడు విష్ణుకుమార్‌రాజు, ఏపీఎంఎస్‌ఎంఈడీసీ చైర్మన్‌ టి.శివశంకర్‌ను కలిసి మొర పెట్టుకున్నట్లు తెలిపారు.

మొక్కుబడి చెల్లింపులు

ప్రభుత్వం ఎట్టకేలకు గతేడాది జూలైకు సంబంధించిన రూ.40 కోట్లను మంగళవారం విడుదల చేసిందని జీవీఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీవీ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.సంజీవరెడ్డి తెలిపారు. ఇంకా రూ.380 కోట్ల భారీ మొత్తం పెండింగ్‌లోనే ఉందని వారు వెల్లడించారు. దసరా సందర్భంగా త్వరలో మరిన్ని బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వెల్లడించారు. అయితే కాంట్రాక్టర్లలో పూర్తిస్థాయి భరోసా కనిపించడం లేదు. ‘ఈ మొక్కుబడి చెల్లింపులతో మా కష్టాలు తీరవు. కనీసం ఆరు నెలల బిల్లులైనా ఒకేసారి చెల్లిస్తేనే మేం ఆర్థికంగా గట్టెక్కగలం. లేకపోతే పనులు కొనసాగించే పరిస్థితిలో కూడా లేము.’ అని పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement