
దివ్యాంగుల ఆందోళన
మహారాణిపేట : సదరం సర్టిఫికెట్లలో దివ్యాంగుల శాతం తగ్గింపుపై వారంతతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పర్సంటేజీనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్ రాజు మాట్లాడుతూ 2010లో జారీ చేసిన సదరం సర్టిఫికెట్లలో ఉన్న పర్సంటేజీని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పర్సంటేజీ తగ్గించడం వల్ల పింఛన్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్. మల్లేశ్వరి మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దని కోరారు.
దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దు
దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దు. ఎంతో మంది పింఛన్లు మీద ఆధారపడి బతుకుతున్నారు. సదరం సర్టిఫికెట్లలో ఉన్న శాతాన్ని కూడా తగ్గించకూడదు. ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి. నాకు 80 శాతం అంగవైకల్యం..పింఛన్‌తో జీవిస్తున్నాం. ఈనేపథ్యంలో అంగవైకల్యం శాతం తగ్గించి పింఛన్ రాకుండే చేస్తే మా కుటుంబం రోడ్డున పడతాం. – ఎస్.మల్లేశ్వరి, కంచరపాలెం

దివ్యాంగుల ఆందోళన