
మహిళలకు శాపంగా కూటమి పాలన
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలన మహిళలకు శాపంగా మారిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆవేదన వ్యక్తం చేశారు. సీతమ్మధారలో మూగ మైనర్‌పై జరిగిన లైంగిక దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా లభిస్తోందని, బెల్ట్ షాపులు పెరిగాయని ఆరోపించారు. మద్యం మత్తులో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కూటమి 15 నెలల పాలనలో మహిళలపై సగటున గంటకు 70 అఘాయిత్యాలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దిశ యాప్‌ను తొలగించి, శక్తి యాప్‌ను ప్రవేశపెట్టారని, అయితే దాని గురించి ప్రజలకు అవగాహన లేదని ఆమె పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు మహిళలకు ఎంతో రక్షణ కల్పించాయని గుర్తు చేశారు. హోంమంత్రి అనిత వెంటనే బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తరఫున న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీదేవి వర్మ, కార్పొరేటర్లు శశికళ, పార్టీ మహిళా నాయకులు యరబిల్లి వరలక్ష్మి, నమ్మి లక్ష్మి పాల్గొన్నారు.