
టౌన్‌ప్లానింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం
మహారాణిపేట: ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో, గత వారంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను సమీక్షించి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఫిర్యాదులను ఉన్నతాధికారులకు పంపించడం కాకుండా వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పోలీసు శాఖ, జీవీఎంసీ, పట్టణ ప్రణాళికా విభాగాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా సమాధానాలు రాసిన పట్టణ ప్రణాళికా విభాగం అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ తరహా నిర్లక్ష్యం పునరావృతమైతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించవద్దన్నారు.
315 వినతుల స్వీకరణ : పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి మొత్తం 315 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూకు 119, జీవీఎంసీకి 85, పోలీసు శాఖకు 21, ఇతర శాఖలకు 90 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.