
వినాయక ఉత్సవాల పొడిగింపు
జగదాంబ: పూర్ణామార్కెట్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ దర్శనాలను నిర్వాహకులు మరో ఆరు రోజుల పాటు పొడిగించడం చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలను చంద్రగ్రహణం లోపే నిమజ్జనం చేయాలని పండితులు సూచించిన సంగతి తెలిసిందే. అయితే పూర్ణామార్కెట్‌లో ఉత్సవాలను పొడిగించడంపై భక్తులు, ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రగ్రహణం తర్వాత నిమజ్జనాన్ని చేయడం సంప్రదాయానికి విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పొడిగింపు కారణంగా మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, రహదారి మధ్యలో భారీ వేదికలు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు, వాహనచోదకులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార ని పలువురు వాపోతున్నారు. పండగ సంప్రదాయాలను గౌరవిస్తూనే, ప్రజా సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని.. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.