
నంబరు ప్లేటు మార్చి కోళ్ల వ్యర్థాల తరలింపు
సింహాచలం: వాహనం నంబర్ ప్లేట్లను మార్చి కోళ్ల వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న ఐదు వాహనాలను జీవీఎంసీ అధికారులు ఆదివారం గుర్తించారు. పాత అడవివరంలో తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోళ్ల వ్యర్థాల రవాణాకు జీవీఎంసీ కొన్ని ప్రత్యేక వాహనాలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. అయితే అనుమతి పొందిన వాహనాల నంబర్ ప్లేట్లను అక్రమంగా ఇతర వాహనాలకు మార్చి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా జీవీఎంసీ వెటర్నరీ అధికారి వాసు, జోన్–8 శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేష్, సిబ్బంది ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అసలు నంబర్ ప్లేటుపై మరో నంబర్ స్టిక్కర్ అతికించి ఉన్నట్లు కనుగొన్నారు. విచారణలో అసలు వాహనం రిపేరుకు రావడంతో దాని నంబర్‌ను మరో వాహనానికి అతికించినట్లు డ్రైవర్ తెలిపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు మొత్తం ఐదు వాహనాలను తనిఖీ చేశారు. వాటిలో రెండు వాహనాలకు మాత్రమే అనుమతులు ఉండగా, మిగిలిన మూడు వాహనాలపై అనుమానం రావడంతో వాటితో సహా మొత్తం ఐదు వాహనాలను ఆరిలోవలోని డంపింగ్ యార్డుకు తరలించి సీజ్ చేశారు. ఇంకా ఎన్ని అనధికారిక వాహనాలు తిరుగుతున్నాయో గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఐదు వాహనాలను సీజ్ చేసిన
జీవీఎంసీ అధికారులు