
ఆరుగురిని కాపాడిన లైఫ్‌గార్డ్స్
కొమ్మాది: రుషికొండ బీచ్‌లో ఆరుగురు పర్యాటకులు సముద్ర అలల తాకిడికి కొట్టుకుపోతుండగా, అప్రమత్తమైన లైఫ్‌గార్డ్స్ వారిని సురక్షితంగా రక్షించారు. శనివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ నుంచి ఎనిమిది మంది యువతీ యువకులు రుషికొండ బీచ్‌ను సందర్శించేందుకు వచ్చారు. సముద్రంలో స్నానానికి దిగినప్పుడు, అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారిలో గణేష్, మాన్సీ గోస్వామి, లోకేష్, ప్రియాంక, బాసు ప్రధాన్, అర్చల్ ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న లైఫ్‌గార్డ్స్ ఈ విషయాన్ని గమనించారు. వేగంగా స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తరువాత, మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా వారి ఇంటికి పంపించారు. పర్యాటకుల ప్రాణాలు కాపాడిన లైఫ్‌గార్డ్స్‌ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు.