
విశాఖలో బహుజనగణమన ఆవిష్కరణ
అల్లిపురం: బీసీల హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి వివిధ వర్గాల నుంచి మద్దతు కోరుతూ పలువురు బీసీ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమాలలో కవి జూలూరు గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ దీర్ఘకావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే, సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాల వద్ద , ఆర్.కే. బీచ్‌లోని జాలాది విగ్రహం వద్ద జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ రాసిన ఈ కావ్యాన్ని మాజీ వీసీ కే.ఎస్. చలం, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గోడి నరసింహాచారి, బీసీ స్టడీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేంకటేశ్వరరావు, రచయిత్రి జాలాది విజయ, అరసం నాయకులు ఉప్పల అప్పలరాజు, శ్యామసుందర్, స్ట్రగుల్ ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గౌడ్ తదితరులు ఆవిష్కరించారు.
కవులారా మీరెటువైపు? నుంచి బహుజనగణమన వరకు
ఈ సందర్భంగా మాజీ వీసీ కే.ఎస్. చలం మాట్లాడుతూ విశాఖ విద్యార్థులు శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా వేసిన ‘కవులారా మీరెటువైపు?’ కరపత్రం విప్లవ కవిత్వానికి ఎలా దారి తీసిందో గుర్తు చేశారు. ఇప్పుడు జూలూరు రాసిన ‘బహుజనగణమన’ కావ్యం బహుజన ఉద్యమానికి ఒక డిక్లరేషన్ లాంటిదని పేర్కొన్నారు. గోడి నరసింహాచారి మాట్లాడుతూ, 1970లలో దిగంబర కవులు తమ కవిత్వాన్ని రిక్షా కార్మికుడి చేత ఆవిష్కరింపజేసిన విధంగానే, ఇప్పుడు జూలూరు కావ్యాన్ని పలు చేతివృత్తుల వారి చేత ఆవిష్కరింపజేయడం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నారు. కావ్యకర్త జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తరతరాల అణిచివేతకు గురైన బీసీల హక్కులు, సామాజిక న్యాయం అనే అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ కావ్యాన్ని రచించినట్లు తెలిపారు.
కులవృత్తుల చేత పుస్తకావిష్కరణ
జీవీఎంసీ 38వ వార్డులో పలు కులవృత్తులు, చేతివృత్తుల వారి చేత ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు.