బయో మైనింగ్‌లో నిజాలకు పాతర! | - | Sakshi
Sakshi News home page

బయో మైనింగ్‌లో నిజాలకు పాతర!

Sep 7 2025 7:05 AM | Updated on Sep 7 2025 7:05 AM

బయో మ

బయో మైనింగ్‌లో నిజాలకు పాతర!

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

కాపులుప్పాడలోని బయో మైనింగ్‌లో జీవీఎంసీ అధికారులు నిజాలను పాతరేస్తున్నారు. ఇక్కడ బయో మైనింగ్‌ ప్రక్రియ చేపట్టామంటూ రూ.2 కోట్లు కాజేసేందుకు పాత తేదీలతో బిల్లులను కమిషనర్‌కు సమర్పించారు. సుమారు 8 నెలల క్రితం పని పూర్తయినట్టు చెబుతున్న అధికారులు.. ఇప్పుడు ఫైలును కదుపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డులో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో బయో మైనింగ్‌ ప్రక్రియ చేపట్టారు. తద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి వినియోగించుకునేందుకు అనుకూలంగా తయారుచేశారు. మిగిలిన భూమిలో కూడా బయో మైనింగ్‌ చేపట్టాలంటూ కూటమి ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో టెండర్‌ను పూర్తి చేశారు. ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు సదరు సంస్థ సమర్పించిన అనుభవ పత్రంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పని జరిగిందా? లేదా అనేది కూడా అధికారులు పరిశీలన చేయకుండానే ఏకంగా రూ.2 కోట్ల బిల్లుల చెల్లింపుల కోసం 8 నెలల తర్వాత పాత తేదీలతో కమిషనర్‌ అనుమతికి పంపించారు. బిల్లుల చెల్లింపుల ద్వారా కమిషనర్‌ను కూడా ఇందులో ఇరికించాలనే ఆలోచనలో కిందిస్థాయి జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జెన్యూనిటీ చెక్‌ ఏదీ?

వాస్తవానికి ఏదైనా సంస్థ ఫలానా వద్ద పనిచేశానంటూ టెండర్‌ దాఖలు చేసే సమయంలో అర్హత పత్రాన్ని జత చేయడం సహజం. ఇక్కడ బయో మైనింగ్‌ పేరుతో రూ.2 కోట్ల పనులకు కూడా సదరు సంస్థ త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా మునిసిపాలిటీలో పని చేసినట్టు అర్హత పత్రాన్ని సమర్పించింది. ఈ అర్హత పత్రంపై అగర్తలా కమిషనర్‌ సంతకం కూడా చేశారు. అయితే, సంతకం కింద ఎక్కడా స్టాంపింగ్‌ మాత్రం వేయలేదు. తమ వద్ద ఫలానా సంస్థ... ఫలానా పనిచేసిందని చెబుతూ ఇచ్చే సర్టిఫికెట్‌పై సహజంగా ఇంజనీర్ల సంతకాలు ఉంటాయి. ఇక్కడ ఇందుకు భిన్నంగా ఏకంగా ఐఏఎస్‌ అధికారి సంతకం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ఆయన ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న సమయంలో ఈ పత్రాన్ని జారీచేయడం కూడా మరిన్ని సందేహాలు తలెత్త విధంగా ఉన్నాయి. మన ఘనత వహించిన జీవీఎంసీ ఇంజనీర్లు మాత్రం కనీసం ఈ పత్రం నిజమైనదా? కాదా? ఇందులో ఉన్న జెన్యూనిటీ ఎంత అనేది కనీసం విచారణ కూడా చేయకపోవడంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సహజంగా టెండర్‌ను ఫైనల్‌ చేసే సమయంలో అక్కడి అధికారులతో ఒకసారి క్రాస్‌ చెక్‌ చేసుకుని మరీ తుది నిర్ణయం తీసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ఇటువంటిదేమీ జరగలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే జీవీఎంసీలో క్లాప్‌ వాహనాలను నిర్వహించే సాయి పావని కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ మొత్తం వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. జీవీఎంసీలోని మెకానికల్‌ విభాగంతో.. క్లాప్‌ వాహనాల్లో పెనవేసుకున్న బంధం కాస్తా బయో మైనింగ్‌ వరకూ సాగిందని అర్థమవుతోంది. ఇందులో కమిషనర్‌ను కూడా ఇరికించేందుకు పాత తేదీలతో తాజాగా బిల్లులు పంపడం గమనార్హం.

బయో మైనింగ్‌ అంటే...!

డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన భారీ వస్తువులను తీసివేసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను బయో–స్టెబిలైజింగ్‌ ద్వారా కంపోస్ట్‌గా మారుస్తారు. తద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి పొందవచ్చు, ఇది ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని కాపులుప్పాడ వద్ద 2007లో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల నుంచి వచ్చే వ్యర్థాలను ఇక్కడే డంప్‌ చేస్తున్నారు. తద్వారా ఇప్పటికే 60 శాతానికిపైగా భూమి వ్యర్థాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో బయో మైనింగ్‌ ద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి పొందేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియను చేపట్టారు. తద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి పొందే అవకాశం ఏర్పడింది. యార్డులో ఇంకా వ్యర్థాలు ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వంలో మరోసారి రూ.2 కోట్లతో బయో మైనింగ్‌ను చేపట్టారు. ఈ కాంట్రాక్టును ఇప్పటికే జీవీఎంసీలో క్లాప్‌ వాహనాల కాంట్రాక్టును నిర్వహించే కాంట్రాక్టరే సాయి పవని సంస్థ పేరుతో చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం బయో మైనింగ్‌ను అగర్తాలో మునిసిపాలిటీలో చేపట్టినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించి టెండరును దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నకిలీ సర్టిఫికెట్‌తో టెండర్‌ దక్కించుకున్నట్టు ఆరోపణలు

అర్హత పత్రం సరైనదో కాదో కూడా నిర్ధారించుకోని జీవీఎంసీ

నేరుగా రూ.2 కోట్ల బిల్లుల చెల్లింపులకు రంగం సిద్ధం

పాత తేదీలతో కమిషనర్‌ ముందుకు ఫైలు

కమిషనర్‌నూ ఇరికించేందుకు పన్నాగం!

బయో మైనింగ్‌లో నిజాలకు పాతర!1
1/1

బయో మైనింగ్‌లో నిజాలకు పాతర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement