
కూటమి టెండరింగ్
విశాఖ సిటీ: జిల్లాలో బార్ల కేటాయింపులో కూటమి నేతల టెండ‘రింగ్’ బట్టబయలైంది. బార్ల డిపాజిట్ ధరలు భారీగా తగ్గించి వాటిని సొంతం చేసుకునే ఎత్తుగడ స్పష్టంగా కనిపించింది. కొత్త బార్లకు దరఖాస్తులు రాకుండా తెరవెనుక నడిపిన తతంగం బహిర్గతమైంది. జిల్లాలో కొత్త బార్లకు ఎవరూ ముందుకు రాకుండా కూటమి రింగ్ మాస్టర్లు బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. జీవీఎంసీ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 121 బార్లకు కేవలం 57 బార్లకు మాత్రమే దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. వీటికి శనివారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా లాటరీ తీసి బార్లను కేటాయించారు. మిగిలిన 64 బార్లను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భారీగా డిపాజిట్ ధరలు తగ్గించి చేజిక్కించుకోవాలని కూటమి నేతలు ఎత్తులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సగం బార్లకు కూడా జరగని లాటరీ
జీవీఎంసీ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 121, కల్లు గీత కులాలకు 10 బార్లు మొత్తంగా 131 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. గతేడాది వైన్‌షాపులను చేజిక్కించుకున్నట్లుగానే ఈ బార్లను కూడా సొంతం చేసుకోవాలని కూటమి నేతలు పక్కా ప్లాన్ వేశారు. అయితే బార్ లైసెన్సు కోసం 50 వేలు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, రూ.5 లక్షలు దాటితే రూ.75 లక్షలు చెల్లించాల్సి ఉంది. లైసెన్సు ఫీజు భారీగా ఉండడంతో దాన్ని తగ్గించే ఎత్తుగడ వేశారు. తొలి దశలో నిర్వహించే లాటరీకి దరఖాస్తులు రాని పక్షంలో తర్వాత ఆ లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించి తద్వారా బార్లను సొంతం చేసుకోవాలని ఆలోచనకు వచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే కూటమిలో ఒక గ్యాంగ్ ఆ బాధ్యతను తీసుకుని బార్లకు ఎక్కువగా దరఖాస్తులు రాకుండా తెరవెనుక కథ నడిపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పైకి వైన్‌షాపులు కారణంగానే బార్ల నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదన్న ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెపంతో లైసెన్స్ ఫీజు భారీగా తగ్గించిన తర్వాత బార్లను చేజిక్కించుకునే కుట్రకు తెరతీశారన్న టాక్ వినిపిస్తోంది. ఫలితంగా జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 121కి, గీత కులాలకు చెందిన 10 బార్లకు కేవలం 263 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీని ప్రకారం ఓపెన్‌లో 57 బార్లకు దరఖాస్తులు చేశారు.
ఒక్కరే నాలుగేసి..
ఓపెన్ కేటగిరీలో కూడా బార్లకు ఒక్కరే నాలుగేసి దరఖాస్తులు చేయడం గమనార్హం. వీరిలో అధిక సంఖ్యలో కూటమికి చెందిన వారే ఉండడం విశేషం. ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీసే అవకాశముంది. దీంతో బయట వారు ఎవరూ దరఖాస్తులు చేయకుండా కేవలం కూటమికి చెందిన వారే ఒక్కొక్కరు నాలుగేసి దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఒక్కొక్కరు నాలుగు దరఖాస్తులకు అప్లికేషన్ ఫీజుతో కలిపి రూ.20.40 లక్షలు చెల్లించారు. ఫలితంగా లాటరీ ప్రక్రియ నామమాత్రంగా మారిపోయింది. నిబంధనల ప్రకారం లాటరీ తీసినప్పటికీ.. ఒక్కో బార్‌కు ఒక్కరే ఉండడంతో పోటీ లేకుండా పోయింది. వారికే ఆ బార్ దక్కింది. కల్లు గీత కులాలకు కేటాయించిన 10 బార్లకు ఇదే తరహాలో దరఖాస్తులు రాగా వాటికి కూడా లాటరీ తీసి కేటాయించారు.
డిపాజిట్ ధరలు భారీగా తగ్గించి తీసుకునేందుకు కూటమి నేతల కొత్త ఎత్తుగడ సగానికి పైగా బార్లకు దరఖాస్తులు పడకుండా తెరవెనుక వ్యూహాలు
జిల్లాలో 131 బార్లకు గాను 67 బార్లకే దరఖాస్తుల రాక
అది కూడా ఒక్కో బార్‌కు ఒక్కరే నాలుగేసి దరఖాస్తులు
లాటరీ తీసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
ఓపెన్‌లో 57, గీత కులాలకు 10 బార్లు కేటాయింపు