
పోర్టులో ట్రైనీ ఐపీఎస్‌ల బృందం
సాక్షి, విశాఖపట్నం : వివిధ రాష్ట్రాలకు చెందిన 28 మంది ట్రెయినీ ఐపీఎస్ అధికారుల బృందం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ(వీపీఏ)ని బుధవారం సందర్శించారు. సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో ఎదురయ్యే ఆధునిక సవాళ్ల గురించి అవగాహన ఏర్పరచుకునేందుకు ఈ సందర్శన సాగించారు. పోర్టు అధికారులు బృందానికి స్వాగతం పలికారు. పోర్టులో జరుగుతున్న వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల గురించి పోర్టు అధికారులు వివరించారు. అనంతరం మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ, కవర్డ్ గోదాములు, సోలార్ పవర్ ఉత్పత్తి, పరిశ్రమల కోసం ఎస్‌టీపీ నీటి పునర్వినియోగం, పెట్టుబడుల అవకాశాలు ఎగుమతి దిగుమతులు మొదలైన విభాగాలను ట్రైనీ ఐపీఎస్ అధికారులు సందర్శించి.. సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం మంగమారిపేట తీరంలో పర్యటించి మైరెన్ అడిషనల్ ఎస్పీ మధుసూదనరావు ఆధ్వర్యంలో మత్స్యకారులతో సమావేశమయ్యారు. మత్స్యకారుల జీవన విధి విధానాలు, తుఫాన్ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలపై అధ్యయనం చేశారు.