
రూ.103 కోట్లతో జైళ్ల అభివృద్ధి
ఆరిలోవ: రాష్ట్రంలో వివిధ జైళ్లలో రూ.103 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఏపీ జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ పనుల కోసం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్‌ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు జవహర్‌బాబు, సాయి ప్రవీణ్, సూర్యకుమార్, జైలర్లతో కలసి పలు బ్యారక్‌లు, ఆస్పత్రులను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జైళ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో 250 మంది ఖైదీల సామర్ధ్యం కలిగిన కొత్త బ్యారక్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు.
ఐసీజీఎస్ 2.0తో శాఖల మధ్య సమన్వయం
జైళ్ల శాఖతో పోలీస్, న్యాయ శాఖలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టం 2.0(ఐసీజీఎస్) టెక్నాలజీని ఏర్పాటు చేశామని, దీని వల్ల ఆ మూడు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుందని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, డెస్క్ టాప్‌లు వినియోగించి, ఆన్‌లైన్ విధానం అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 14 కేంద్ర కారాగారాల్లో సూపరింటెండెంట్లకు ఒక్కో ల్యాప్‌టాప్ చొప్పున అందించామన్నారు. వీటితో పాటు అన్ని కేంద్ర కారాగారాలు, జిల్లా, సబ్ జైళ్లకు మరో 108 డెస్క్‌టాప్‌లు అందించామని తెలిపారు. దీనివల్ల సాంకేతిక, పరిపాలనా విధానం, సీసీ కెమెరాల పనితీరు, అవి ఏ విధమైన సాంకేతికతతో కూడి ఉన్నాయి, ఖైదీల పూర్తి వివరాలు, బయోమెట్రిక్ విధానం తదితర అంశాలు స్పష్టంగా నమోదై ఉంటాయన్నారు. ఆ వివరాలు అవసరం మేరకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్