కొమ్మినేని అరెస్ట్.. కూటమి డైవర్షన్ రాజకీయం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల వ్యతిరేకతను మళ్ళించేందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారని వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి డా. మంచా నాగమల్లేశ్వరి ఆరోపించారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత జిల్లాలో మహిళ హత్య జరిగినా హోంమంత్రి పరామర్శించకపోవడం దౌర్భాగ్యమని నాగమల్లేశ్వరి విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రిత్వ శాఖ చివరి స్థానంలో ఉందని ప్రకటించడం చూస్తే, మహిళల రక్షణ గాలికి వదిలేసినట్టేనని అన్నారు. పచ్చ మీడియా ఓనర్లను, జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని నిలదీశారు. డైవర్షన్ రాజకీయాలు మాని మహిళల ప్రాణాలు రక్షించాలని హోంమంత్రి అనితకు సూచించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి డా. మంచా నాగమల్లేశ్వరి


