నేడే ‘మహిళా’ పోరు
విశాఖస్పోర్ట్స్: భారత్– శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ–20 సిరీస్ సమరానికి తెరలేచింది. నగరంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు సిరీస్‌ను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తుది జట్టులో కీలక మార్పులు చేస్తూ యువతకు అవకాశం కల్పించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా, రిచా ఘోష్ వంటి స్టార్ ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక జట్టు ఈసారి తమ యువ స్పిన్నర్లనే నమ్ముకుంది. శనివారం మైదానంలో ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్ కోసం నగర క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


