23 నుంచి ‘పీసా’ మహోత్సవాలు
మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: నగరంలో ఈనెల 23, 24 తేదీల్లో ప్రతిష్టాత్మక పీసా మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోర్ట్ స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు 10 రాష్ట్రాల గిరిజన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులో 10కే రన్‌తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు నగరంలో గాలి నాణ్యత తగ్గడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కాలుష్య నివారణకు కఠిన నిబంధనలు జారీ చేశారు. చెత్త తగులబెట్టడం, భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం వంటి పనులకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఫ్యాక్టరీల్లో పొగ నియంత్రణ, పాత వాహనాల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని, విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.


