ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూల్ ఆటో
ఆరిలోవ: రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. హనుమంతవాక జంక్షన్‌కు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. ఆరిలోవ ప్రాంతం నుంచి ఎంవీపీకాలనీ వైపు పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్తున్న ఒక ఆటో.. జాతీయ రహదారిపై హనుమంతవాక పాత మేకల కబేళా సమీపంలోని బస్టాప్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆటోలో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు చిన్నారులు భయాందోళనతో వణికిపోయారు. స్థానికులు, వాహనచోదకులు వెంటనే స్పందించి విద్యార్థులకు సపర్యలు చేసి.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆటో బోల్తా పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గురైన ఆటోను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి ఆటోలే కారణం
కాగా.. బస్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి రెండు ఆటోలను వరుసగా నిలిపి ఉంచారు. దీంతో ఆరిలోవ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్.. బస్టాప్‌లో ఖాళీ లేకపోవడంతో ఆ ఆటోల పక్కనే రోడ్డు మధ్యలో బస్సును నిలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న స్కూల్ ఆటో నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొంది. బస్టాప్‌ల వద్ద ఆటోలు నిలపకుండా, దూరంగా ఆగేలా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనచోదకులు డిమాండ్ చేస్తున్నారు.


