డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు
అల్లిపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నగర సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, కూర్గ్, పశ్చిమ గోదావరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడి టెలిగ్రామ్ చానల్ ద్వారా వివిధ వ్యక్తుల నుంచి కరెంట్ అకౌంట్లను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైం పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నిందితులు పెద్ద రుషికొండలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో గదులు తీసుకొని అక్కడి నుంచే బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. శనివారం ఆ హోటల్‌పై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున డెబిట్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి సిద్ధం చేసుకున్న వివిధ సంస్థల రబ్బర్ స్టాంపులు, క్యూఆర్ కోడ్ స్కానర్లు, సిమ్ కార్డులు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఎన్.వినోద్‌కుమార్, పరసురామ సదానంద అలియాస్ పవన్, సలీమ్ కె.హెచ్, పాల్యం చంద్రశేఖర్, సేరు చంటి, కడలి సత్యవరపు లక్ష్మీ శ్రీనివాస్, ఓంకార్ నాథ్ ఉన్నారు.


