చుట్టమే.. దొంగ
గోపాలపట్నం: కొత్తపాలెంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 40 రోజుల పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి.. 13 1/2 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన దొంగలను పట్టుకున్నారు. గోపాలపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం జోన్–2 క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొత్తపాలెం, సంతోష్‌నగర్‌లో నివసిస్తున్న పెంటకోట చెల్లయ్యమ్మ(65) ఇంట్లో నవంబర్ 10న చోరీ జరిగింది. ఆమె తెల్లవారుజామున 3 గంటల సమయంలో పని మీద బయటకు వెళ్లిన విషయాన్ని గమనించి, దుండగులు ఇంట్లో చొరబడి బంగారాన్ని ఎత్తుకుపోయారు. బాధితురాలు చెల్లయ్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెస్ట్ సబ్ డివిజన్ సీఐ చంద్రమౌళి పర్యవేక్షణలో గోపాలపట్నం క్రైమ్ ఎస్‌ఐ జి.తేజ ఈశ్వరరావు, పెందుర్తి క్రైమ్ ఎస్‌ఐ సూరిబాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. పాత నేరస్తులపై నిఘా పెట్టినా, తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో బాధితురాలి ఇంటి పరిసరాలను పరిశీలించి, బంధువులు, పరిచయస్తులను విచారించారు. ఈ క్రమంలో ఫిర్యాదికి దూరపు బంధువైన పీలా లతపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. గతంలో చెల్లయ్యమ్మకు, లత కుటుంబానికి ఆస్తి గొడవలు ఉన్నాయి. చెల్లయ్యమ్మ వద్ద బంగారం ఉందని గమనించిన లత, ఎలాగైనా దాన్ని కాజేయాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఆర్.ఆర్.వి పురానికి చెందిన పెంటకోట బాలకృష్ణ, డొక్కర లిఖిత్ కుమార్‌లతో కలిసి చోరీకి పాల్పడింది. నిందితుల నుంచి బంగారాన్ని రికవరీ చేసి, ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారం ఎంతగానో దోహదపడ్డాయని ఏసీపీ తెలిపారు. ఇంటి విషయాలు బయటి వారికి తెలియకూడదని, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.


