నడకతో ఆరోగ్యం : సీపీ
బీచ్‌రోడ్డు: వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు ఆదర్శనీయులని సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కొనియాడారు. శనివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన 34వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దైనందిన జీవనంలో నడకను వ్యాయామంగా మార్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతకు ఆశ చూపి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపు రూ. 300 కోట్లు దోచుకున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ డాక్టర్ కమల్ బయిద్, అధ్యక్షురాలు కె. ప్రభావతి, పూర్వ అధ్యక్షులు ఎస్.పి.రవీంద్ర, డిస్ట్రిక్ట్ గవర్నర్ కె. ద్వారాకానాఽథ్, మీడియా కన్వీనర్లు నండూరి రామకృష్ణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


