
కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి మండిపడ్డారు. దళిత హోంమంత్రి ఉన్నా దళితులపై దాడులు ఆగడం లేదని, స్వయంగా హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితులను బహిష్కరించారని ఆమె ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెనాలిలో దళిత యువకుడిపై పోలీసుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘దళిత యువకుడు తప్పు చేస్తే రోడ్డు మీద ఒక సీఐ కాలుతో తొక్కి, మరో సీఐ కర్రలు విరిగేలా అత్యంత పాశవికంగా కొడుతుంటే, ఇక చట్టాలు, న్యాయవ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎందుకు?’ అని ఆమె ప్రశ్నించారు. మదనపల్లిలో దళితులపై దాడి, చిత్తూరులో టీడీపీ నేతల ముందు చెప్పులు వేసుకుని తిరిగారని, దళితుడి బైక్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టిన పరిస్థితులు చూశామని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినా, చిన్నారిపై లైంగికదాడులు జరిగినా స్పందించడం లేదని మండిపడ్డారు.