జాబ్స్‌ @ గైస్‌ | - | Sakshi
Sakshi News home page

జాబ్స్‌ @ గైస్‌

May 30 2025 1:02 AM | Updated on May 30 2025 1:02 AM

జాబ్స

జాబ్స్‌ @ గైస్‌

ఉద్యోగ సాధనలో తగ్గేదేలే! ●
● ఐదేళ్లలో 732 ఉద్యోగాలు సొంతం ● సత్తా చాటుతున్న కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు

మురళీనగర్‌: కొలువు ఎవరి సొంతం కాదు.. సత్తా ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. ఇదే విషయాన్ని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(గైస్‌) విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఫలానా ఇంజినీరింగ్‌ కోర్సులు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ గైస్‌ విద్యార్థులు తమకు నచ్చిన కెమికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో రాణిస్తూ.. సులువుగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ కళాశాలలో చేరితే ఉద్యోగం ఖాయమనే నమ్మకాన్ని నిజం చేస్తున్నారు. ప్రతి క్యాంపస్‌ డ్రైవ్‌లోనూ అత్యుత్తమ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందుతూ తమ ప్రతిభను చాటుతున్నారు.

ఐదేళ్లలో రికార్డ్‌ స్థాయి ఉద్యోగాలు

ఒక ప్రభుత్వ డిప్లమో కళాశాలలో పదుల సంఖ్యలో ఉద్యోగాలు రావడమే గొప్పగా చెప్పుకునే రోజుల్లో.. గైస్‌ విద్యార్థులు కేవలం ఐదేళ్లలో ఏకంగా 732 ఉద్యోగాలు పొందడం విశేషం. ఒకే కళాశాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావడం ఒక రికార్డు. వీరిలో 484 మంది బాలురు, 248 మంది బాలికలు ఉన్నారు. సంవత్సరాల వారీగా చూస్తే.. 2020–21లో 178 మంది, 2021–22లో 105 మంది, 2022–23లో 165 మంది, 2023–24లో 105 మంది, 2024–25లో 179 మంది ఉద్యోగాలు సాధించారు. ప్రతి సంవత్సరం సగటున 147 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందుతుండటం గమనార్హం. ఇక గైస్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో నాలుగు విభాగాలు ఉన్నాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 204 మంది, పెట్రో కెమికల్స్‌లో 183 మంది, ప్లాస్టిక్‌ అండ్‌ పాలిమర్స్‌లో 203 మంది, ఆయిల్‌ టెక్నాలజీలో 142 మంది ఉద్యోగాలు సాధించారు. బాలికల విషయానికి వస్తే.. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 76 మంది, పెట్రో కెమికల్స్‌లో 64 మంది, ప్లాస్టిక్‌ అండ్‌ పాలిమర్స్‌లో 55 మంది, ఆయిల్‌ టెక్నాలజీలో 53 మంది ఉద్యోగాలు పొందారు.

అధిక ప్యాకేజీల్లో బాలికల హవా

అత్యధిక వార్షిక వేతనం సాధించడంలో బాలికలు ముందంజలో ఉన్నారు. డిప్లమో స్థాయిలోనే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు దీటుగా అధిక జీతాలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా డి.వంశీప్రియాంక (ఏసియన్‌ పెయింట్స్‌) రూ. 6.73 లక్షలు, ఎస్‌కే జఫ్రీన్‌ అరాఫాతి(ఏసియన్‌ పెయింట్స్‌) రూ.6 లక్షలు, ఎస్‌.వైశాలి(ఏసియన్‌ పెయింట్స్‌) రూ. 6 లక్షలు, జి.గీతా భవాని (అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌) రూ.4 లక్షలు, ఎల్‌.తేజస్విని (అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌) రూ.4 లక్షలు, టి.సంధ్య (టెక్నిప్‌ ఎనర్జీస్‌) రూ.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. బాలురు కూడా మంచి ప్యాకేజీలు సాధించారు. జీఎస్‌కే చైతన్య (అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌) రూ.4 లక్షలు, ఐ.మాధవరావు(ది ఆంధ్ర పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌) రూ.3.6 లక్షలు, డి.సాయిలోకేష్‌ (సెయింట్‌ గోబెయిన్‌) రూ. 2.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. కొన్ని కంపెనీలు వీరికి ఇతర ఆర్థిక ప్రయోజనాలు, ప్రయాణ సౌకర్యాలు, క్యాంటీన్‌లో రాయితీ భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి.

వెయ్యి ఉద్యోగాలే లక్ష్యం

వచ్చే ఏడాది నాటికి తమ కళాశాల విద్యార్థుల ఉద్యోగాల సంఖ్య వెయ్యికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. క్యాంపస్‌ డ్రైవ్‌కు వెళ్లిన ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలి. ఇందుకోసం ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాం. మల్టీ నేషనల్‌ కంపెనీలు, నవరత్న కంపెనీల్లో మా విద్యార్థులు పని చేస్తున్నారు. బాలురతో పాటు బాలికలకు సమ ప్రాధాన్యమిస్తూ ఉద్యోగాల సాధనకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ బ్రోచర్స్‌, స్టడీ మెటీరియల్స్‌లో మా విద్యార్థుల ఫొటోలు ప్రచురించడం మాకు గర్వకారణం.

–డాక్టర్‌ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్‌, గైస్‌

జాబ్స్‌ @ గైస్‌ 1
1/4

జాబ్స్‌ @ గైస్‌

జాబ్స్‌ @ గైస్‌ 2
2/4

జాబ్స్‌ @ గైస్‌

జాబ్స్‌ @ గైస్‌ 3
3/4

జాబ్స్‌ @ గైస్‌

జాబ్స్‌ @ గైస్‌ 4
4/4

జాబ్స్‌ @ గైస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement