
రాజకీయ కుట్రతోనే రేషన్ వెహికల్స్ రద్దు
బీచ్‌రోడ్డు: కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రకోణంతోనే రేషన్ వాహనాల జీవోను రద్దు చేసిందని వైస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆరోపించారు. ఎండీయూ వాహనాలను కొనసాగించి, తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎండీయూ డ్రైవర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్‌ఐసీ బిల్డింగ్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఆదివారం శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా పాల్గొన్న కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ డిపోల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుని, నానా ఇబ్బందులు పడుతున్న పేదల దుస్థితిని చూసే.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్దకే రేషన్ అందించాలని సరికొత్త వ్యవస్థను రూపొందించారని పేర్కొన్నారు. తద్వారా 20 వేల కుటుంబాలకు ఉపాధి కూడా చేకూరిందన్నారు. ఈ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పని చేసిందంటే.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఈ సమయంలో, జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో, కేవలం రాజకీయ కుట్ర కోణంలో ఈ వ్యవస్థను రద్దు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు కూటమి ప్రభుత్వంను అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రేషన్ వెహికల్స్ ప్రజల్లో తిరిగితే గత వైఎస్సార్‌సీపీ సుపరిపాలన ప్రజలకు గుర్తుకు వస్తుందనే రద్దు చేశారన్నారు. ఈ వ్యవస్థ రద్దు ద్వారా సుమారు 20 వేల ఎండీయూ ఆపరేటర్స్, హెల్పర్ల కుటుంబాలతో పాటు కోటీ 50 లక్షల లబ్ధిదారులు ఇబ్బందులకు గురవడాన్ని వైఎస్సార్‌సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని, ఎవరు మంచి చేసినా ఆయనకు నచ్చదన్నారు. ప్రధాని మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబు పాలనపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటికీ రేషన్ అందించడం ద్వారా 1.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చారని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారని తెలిపారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకాలను రద్దు చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. పవన్ కల్యాణ్ ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ శాఖపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు జగన్ చేసిన మంచి పనులను తొలగించడం అవివేకమన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, కార్పొరేటర్ బిపిన్ జైన్, నాయకులు మార్కండేయులు, బి.పద్మావతి, ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు ఎన్.బి.సతీష్, స్వామి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్సే..
‘ఎండీయూ’ నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు