
ప్రశాంతంగా యూపీఎస్‌సీ పరీక్షలు
మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యూపీఎస్‌సీ)సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. మొత్తం 8,422 మంది విద్యార్థులకు కోసం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ పరీక్షకు 8,422 మందిలో 4,523 మంది పరీక్షకు హాజరయ్యారు. రెండో సెషన్ పరీక్షకు(మధ్యాహ్నం) 8,422 మందికి 4.496 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇద్దరు పరిశీలకులను నియమించారు. యూపీపీఎస్ నుంచి ఒక పరిశీలకుడుగా డైరెక్టర్ పట్నాయక్‌ను, రాష్ట్ర పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు, జిల్లా కో ఆర్డినేటర్ మయూర్ అశోక్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ స్థానికంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ, అక్కయ్యపాలెం కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీస్, విద్యా శాఖల అధికారులున్నారు.

ప్రశాంతంగా యూపీఎస్‌సీ పరీక్షలు