
కిరాణాషాపులో ఫ్రిడ్జ్ షాక్ కొట్టి విద్యార్థి మృతి
తగరపువలస: ఆనందపురం మండలం చందకలో మంగళవారం కిరాణా షాపులో పనిచేస్తున్న 6వ తరగతి విద్యార్థి రెడ్డి దశ్వంత్(13) ఫ్రిడ్జ్ డోర్ తీయడానికి ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపురం పంచాయతీ దండువారి కళ్లాలలకు చెందిన లారీ డ్రైవర్ అయిన రెడ్డి శివ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ ఆనందపురం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. వేసవి సెలవుల కారణంగా పెద్ద కుమారుడు చందకలో మహేష్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ఫ్రిడ్జ్‌ను తాకడంతో షాక్‌కు గురై పడిపోయాడు. అందుబాటులో ఉన్న గ్రామీణ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మధురవాడలోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.