
దంచి కొట్టిన వర్షం
మహారాణిపేట: పగలంతా భానుడి తీవ్రతకు తోడు.. గాలిలో తేమ కారణంగా ఉక్కబోత. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టిన ఆకాశం. అర్ధరాత్రి దాటాక దంచికొట్టిన వాన. ఇదీ సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నగరంలో వాతావరణ పరిస్థితి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన హోరు వాన నగరాన్ని ముంచెత్తింది. కాసేపు విరామమిచ్చి మళ్లీ కురిసింది. మంగళవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి. వర్షం తగ్గాక.. ఉదయం 9 గంటల నుంచి మళ్లీ ఎండలు షరామామూలే.
ఉక్కబోత వాతావరణం
గత కొద్ది రోజులుగా ఉదయం పూట ఎండ తీవ్రత వల్ల విశాఖ వాసులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. వర్షం కురిసిన తర్వాత కూడా ఎండ వచ్చాక, అదే పరిస్థితి. బంగాళాఖాతంలో రుతుపవనాలు, అల్పపీడనం, పశ్చిమ, నైరుతి నుంచి వీస్తున్న గాలుల వల్ల వర్షాలు పడుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
భారీ వర్షంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. జ్ఞానాపురం రైల్వే వంతెన వర్షపు నీటితో నిండిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్ణామార్కెట్ ఏరియాలో పలు ప్రాంతాల్లో గంటల తరబడి నీరు నిలిచిపోయింది. ఇక్కడే ఓ రోడ్డు కుంగిపోయింది. రైల్వే స్టేషన్ రోడ్డు, డాబాగార్డెన్స్, రైల్వే న్యూకాలనీ, దొండపర్తి, చావులమదుం అక్కయ్యపాలెం, వెలంపేట, పూర్ణామార్కెట్, ఆశీలమెట్ట, కంచరపాలెం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, పాతపోస్టాఫీసు, సీతమ్మధార, కేఆర్‌ఎం కాలనీ, మద్లిపాలెం తదితర ప్రాంతాల్లో చాలా వీధులు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, వైఎస్సార్ సెంట్రల్ పార్కు వద్దనున్న నైట్ ఫుడ్ కోర్టులో వర్షపు నీరు భారీగా చేరింది.
వర్షం తగ్గాక చుర్రుమన్న ఎండలు
నగరంలో కురిసిన వర్షపాతం
ప్రాంతం వర్షపాతం
(మి.మీ.)
విశాఖ రూరల్ 72.4
సీతమ్మధార 65.0
మహారాణిపేట 38.2
గోపాలపట్నం 29.4
భీమునిపట్నం 26.2
ఆనందపురం 24.6
పెదగంట్యాడ 18.6
గాజువాక 18.6
పద్మనాభం 10.4
పెందుర్తి 4.8

దంచి కొట్టిన వర్షం