
స్టీల్‌ప్లాంట్‌లో కార్మిక సమ్మె ప్రశాంతం
● బైక్ ర్యాలీకి యత్నం ● పోలీసుల అదుపులో కార్మిక నాయకులు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం జరిగిన కార్మిక సమ్మెలో ఆరుగురు కార్మిక సంఘ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మినహా ప్రశాంతంగా జరిగింది. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు సక్రమంగా జీతాల చెల్లింపు, హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరణ, కరెంట్ చార్జీల తగ్గింపు, సొంత గనుల కేటాయింపు తదితర డిమాండ్లపై శాశ్వత కార్మికులు ఒక రోజు సమ్మె చేశారు. ఇక కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పాత పద్ధతిలో అందరికీ ఎస్‌ఎంఏ, ఏఎస్‌ఎంఏలను చెల్లించాలని తదితర డిమాండ్లపై కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల షిఫ్ట్ వేళల్లో ప్లాంట్ లోపలికి వెళ్లినప్పటికీ, గేట్ల వద్ద బయోమెట్రిక్ నమోదు చేయించుకోలేదు. షిఫ్ట్–ఎలో కొంత మంది విధులకు హాజరైనప్పటికీ ఆ తర్వాత కొంత మంది కార్మికులు వారికి నచ్చచెప్పి విధుల నుంచి బయటకు తీసుకు వెళ్లిపోయారు.
పోలీసుల అదుపులో కార్మిక నాయకులు
సెంట్రల్ స్టోర్స్ నుంచి కూర్మన్నపాలెం టెంట్ వరకు బైక్ ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు నమ్మి రమణ, యు.సోమేష్, అప్పలరాజు, వంశీ, బి.అప్పారావు, ఉరుకూటి అప్పారావులను జీపులో ఎక్కించి స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ కేశవరావు తెలిపారు.
అధిక శాతం విధులకు హాజరు
ఇదిలా ఉండగా శాశ్వత ఉద్యోగులు రెండు షిఫ్ట్‌లలో 85–90 శాతం వరకు విధులకు హాజరు కాగా, కాంట్రాక్ట్ కార్మికులు 60–70 శాతం హాజరయ్యారు. సర్వీసు విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా విధులకు హాజరు కాగా, కొన్ని ఉత్పత్తి విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు
కార్మికుల సమ్మె సందర్భంగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, తొమ్మిది మంది సీఐలు, 19 మంది ఎస్‌ఐలతో పాటు సుమారు 500 మంది సిబ్బందిని ఆయా గేట్ల వద్ద, ఈడీ(వర్క్స్) బిల్డింగ్, అడ్మిన్ బిల్డింగ్, సెంట్రల్ స్టోర్స్ కూడలితో పాటు అన్ని ముఖ్య విభాగాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులకు వెళ్లే కార్మికులను సమ్మె చేస్తున్నవారు అడ్డుకోకుండా చర్యలు చేపట్టారు.
సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. ఇప్పటికే వందలాది మందిని తొలగించడంతో వారు రోడ్డున పడ్డారన్నారు. వారి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.