
36 గంటల్లో హత్య కేసు నిందితుల అరెస్ట్
పరవాడ: ముత్యాలమ్మపాలెంలో ఈ నెల 18న మైలపల్లి బంగార్రాజుపై కత్తులు, రాళ్లతో దాడి చేసి, హతమార్చిన నిందితులను 36 గంటల వ్యవధిలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అదే గ్రామానికి చెందిన ముద్దాయి చింతకాయల ఎర్రయ్య, మృతుడు బంగార్రాజు వద్ద గతంలో రూ.63 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తం నుంచి రూ.45 వేలు చెల్లించి, ఇంకా రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయమై ఎర్రయ్యను పలుమార్లు బంగార్రాజు అడిగాడు. అంతే కాకుండా అందరికీ చెప్తూ తనను అబాసుపాల్జేస్తున్నాడని ముద్దాయి కోపంతో మృతుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న రాత్రి 9.30 సమయంలో పథకం ప్రకారం ప్రథమ మద్దాయి కొవిరి కామేష్, కొవిరి శివాజీ, కొవిరి ముత్యా లు(ఆర్మీ), చింతకాయల ఎర్రయ్య, కొవిరి ముత్యాలు, వాసుపల్లి ప్రవీణ్‌కుమార్, కొవిరి ముత్యాలమ్మలు కలసి కత్తులు, రాళ్లు, ఐరన్ రాడ్‌తో బంగార్రాజుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బంగార్రాజును వైద్యం కోసం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మృతుడి సోదరుడు మైలపల్లి పోలరాజు గాయపడినట్లు డీఎస్పీ చెప్పారు. మృతుడి భార్య మైలపల్లి బంగారం ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీరిని మడుతూరు జంక్షన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, అచ్యుతాపురం సీఐ గణేష్, రాంబిల్లి ఎస్‌ఐ నరసింగరావు, పరవాడ ఎస్‌ఐలు బి.కృష్ణారావు, వి.సత్యనారాయణ, సిబ్బందిని అభినందించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ఐరన్ రాడ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఈ ఘటనను ఆసరాగా తీసుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్‌ఐలు బి.కృష్ణారావు, సత్యనారాయణ, ఏఎస్‌ఐ బి.ఎర్రునాయుడు పాల్గొన్నారు.
ఏడుగురు నిందితులకు రిమాండ్