
భగ్గుమన్న కార్మిక సంఘాలు
బీచ్‌రోడ్డు: స్టీల్‌ప్లాంట్‌లోని కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్లాంట్ నుంచి పోలీసులను వెనక్కి రప్పించాలని కూడా ఆయన కోరారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 9కి వాయిదా పడిన అఖిల భారత సమ్మెకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అక్రమ తొలగింపులు, పెండింగ్ జీతాలు, హెచ్‌ఆర్‌ఏ అమలు, నాయకులపై సస్పెన్షన్ల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రదర్శన, సభ జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించిన జేఏసీ నాయకులు, సొంత గనులు కేటాయించాలని గత నాలుగేళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఎన్నికల ముందు స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెప్పిన రాష్ట్ర కూటమి నాయకులు, ఇప్పుడు 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగిస్తుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం, ప్లాంట్‌లో పోలీసులను మోహరించడం దుర్మార్గమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలో కొనసాగించడానికి, కార్మికుల ఉపాధిని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్, తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ కార్మికుల సమ్మెలకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జూలై 9న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ఆశా, అంగన్‌వాడీ వంటి వివిధ ప్రభుత్వ పథకాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆటో, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ చెర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం.మన్మథరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఎఫ్‌టీయూఐ అఖిలభారత అధ్యక్షుడు కనకారావు ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులపై ఆందోళన