
షర్మిలతో కాంగ్రెస్ పూర్తి నిర్వీర్యం
తాటిచెట్లపాలెం: పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి షర్మిలకు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మెమోరాండంలు కిల్లి కృపారాణికి అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిచే వారికి కాకుండా.. అధినాయకత్వం ప్రకటించిన వారిని కాదని షర్మిల కొత్త వారికి టికెట్లిచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పక్షంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కలిసిపోయిందని.. ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి, గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ, దూషిస్తూ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో నిలిచేందుకు తప్ప మరేమి చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకోవాలంటే రాష్ట్ర నాయకత్వ మార్పు అత్యవసరమని నేతలంతా కుండబద్దలు కొట్టారు. కిల్లి కృపారాణి మాట్లాడుతూ ఇక్కడి విషయాలను సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలియజేసి, వినతులను పార్టీ అధిష్టానానికి అందజేస్తానన్నారు.