
రేపు డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం..
● ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక అల్టిమేటం ● కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం ● డీఈవోకు నోటీస్ అందజేసిన నాయకులు
విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్‌కు ముందస్తు నోటీస్ అందజేశారు. తమ సమస్యలకు పరిష్కారం లభించేంత వరకు దశలవారీగా పోరాటాలకు సిద్ధమన్నారు. అంతకుముందు డీఈవో కార్యాలయం వద్ద సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్‌టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు విద్యారంగానికి తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఐక్యవేదిక పిలుపులో భాగంగా చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడికి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అంతా తరలిరావాలన్నారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని వినిపించేలా ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా స్టీరింగ్ కమిటీ చొక్కాకుల సూర్యనారాయణ(వైఎస్సార్‌టీఏ), వేణుగోపాల్ (ఏపీహెచ్‌ఎంఏ), టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్–257) జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్.ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938)బి.చిన్నారావు, పీఆర్‌టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.