
స్టీల్‌ప్లాంట్ సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు
పెదగంట్యాడ: అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టనున్న స్టీల్‌ప్లాంట్ పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బీసీ రోడ్డులోని టీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్నారు. నిర్వాసితుల నుంచి 26 వేల ఎకరాల భూమిని తీసుకుని కేవలం 16,500 మందికి ఆర్ కార్డులు ఇచ్చి అందులో కేవలం 8 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని కోరారు. నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారని.. ఉద్యోగులను వీఆర్‌ఎస్ పేరుతో ఇంటికి పంపేస్తున్నారని.. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, పల్లా చినతల్లి, ధర్మాల శ్రీను, కోమటి శ్రీనివాసరావు, మంత్రి శంకర్‌నారాయణ, బొడ్డ గోవింద్, సిరట్ల శ్రీనివాస్ గౌడ్, చిత్రాడ వెంకటరమణ, మద్దాల అప్పారావు, డీవీ రమణారెడ్డి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.