
బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కోసం డీఎంవో
సాక్షి, విశాఖపట్నం: బౌద్ధారామాల్ని పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధారామాల్ని గుర్తిస్తూ.. ఆయా ప్రాంతాల్లో ఉన్నవాటిని బుద్ధిస్ట్ సర్క్యూట్స్‌గా అభివృద్ధి చేయాలని సంక ల్పించింది. గత ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. దానికనుగుణంగా విశాఖలోనూ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు కోసం రెండు సర్క్యూట్స్‌ను ప్రతిపాదించారు. కంప్లీట్ బుద్ధిస్ట్ సర్క్యూట్‌గా విశాఖలోని బౌద్ధారామాలు, అమరావతిలోని బౌద్ధారామాల్ని గుర్తించారు. అదేవిధంగా విశాఖపట్నం సర్క్యూట్‌గా శ్రీకాకుళంలోని శాలిహుండం, విశాఖలోని బావికొండ, తొట్లకొండ, అనకాపల్లిలోని బొజ్జనకొండ, తూర్పుగోదావరి జిల్లాలోని అదుర్రు బౌద్ధారామాల్ని గుర్తించారు. ఈ సర్క్యూట్స్ అభివృద్ధి, నిర్వహణ, మార్కెటింగ్, ప్రమోషన్ కోసం రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్స్(డీఎంవో)ను ఏర్పాటు చేస్తూ టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డీఎంవోకు విశాఖ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గానూ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కో–చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, ఏయూ ప్రొఫెసర్, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల ప్రతినిధులు, టూరిజం శాఖ విశాఖ ఆర్‌డీ, విశాఖ, అనకాపల్లి జిల్లా టూరిజం అధికారులు, ఏపీటీడీసీ విశాఖ డివిజనల్ మేనేజర్, ఈఈలు మెంబర్లుగా వ్యవహరించనున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్స్ వద్ద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలు, స్పాన్సర్‌షిప్‌ల సహాయంతో బౌద్ధారామాల వద్ద పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం మొదలైనవన్నీ డీఎంవోలు చూస్తాయని పేర్కొన్నారు.