
సాంకేతిక ఆవిష్కరణలతోనే సుస్థిర భవిష్యత్తు
● హిందుస్థాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా ● ఘనంగా ఐఐపీఈ స్నాతకోత్సవం
విశాఖ విద్య: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సీఈవో అరుణ్ మిశ్రా పిలుపునిచ్చారు. నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 5వ వార్షిక స్నాతకోత్సవం శనివారం నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణ్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు భిన్నంగా ఆలోచించాలన్నారు. చదువుకునే రోజుల్లోనే దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. హిందుస్థాన్ జింక్ ఇన్నోవేషన్ జర్నీలోని ఉదాహరణలను వివరిస్తూ.. సుస్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడంలో కృత్రిమ మేధ, హైడ్రోజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల పాత్రను తెలియజేశారు. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పరితోష్ కె.బానిక్ మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ పరివర్తన భారతదేశానికి అత్యంత ఆవశ్యకమని, ఈ దిశగా సుస్థిర ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఐఐపీఈ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్లిష్టమైన ఇంధన సవాళ్లను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు.
రూ.150 కోట్లతో రీసెర్చ్ పార్కు
సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ మాట్లాడుతూ రూ.150 కోట్లతో ఐఐపీఈ–మాగ్నివియా బిజినెస్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ పార్క్‌ను సబ్బవరంలోని సొంత క్యాంపస్‌లో త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఐఐపీఈ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. సహజ హైడ్రోజన్‌పై భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. కెమ్ టెక్ ఫౌండేషన్ నుంచి ఎనర్జీ ఎక్సలెన్స్ అవార్డు–2025ను అందుకోవడంతో సంస్థ ప్రతిష్ట పెరిగిందన్నారు. 15 శాతం అంతర్జాతీయ ప్రాజెక్టులు, గ్లోబల్ ఎలెక్టివ్‌లతో అంతర్జాతీయ స్థాయిలో ఐఐపీఈ ముందంజలో ఉందన్నారు.
51 మందికి డిగ్రీలు ప్రదానం
స్నాతకోత్సవంలో మొత్తం 51 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరికి పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో 15 మందికి, బీటెక్‌లో 34 మందికి(పెట్రోలియం ఇంజినీరింగ్–8, కెమికల్ ఇంజినీరింగ్–26) డిగ్రీలు అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను ప్రదా నం చేశారు. ఆల్బర్ట్ ఇజాక్ మొహంతి (బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్) అకడమిక్ ఎక్సలెన్స్, ఆల్ రౌండ్ ప్రతిభకు గాను ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్‌లో అహోల్జియా నందీష్ అమిత్‌కుమార్ (గోల్డ్), ఆయుష్ గుప్తా (వెండి), బీటెక్ పెట్రోలియం ఇంజినీరింగ్‌లో బిశ్వజిత్ పాటి (గోల్డ్), బోకం శ్రీరామ మణికంఠ గణేష్ (వెండి), ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో డెబాసిస్ సాహు (గోల్డ్), సుజాత మాఝీ (వెండి) ప్రతిభ చూపా రు. బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో అందించే బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్ స్టూడెంట్ మెడల్‌ను ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీ విద్యార్థిని సుజాత మాఝీకి ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామ్ ఫాల్ ద్వివేది, సెనేట్ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సాంకేతిక ఆవిష్కరణలతోనే సుస్థిర భవిష్యత్తు